Sonu Sood: సోనూ సూద్ ఆరోపణలపై స్పందించిన చైనా రాయబారి
- పెద్ద ఎత్తున ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు సోనూసూద్ ఆర్డర్
- వాటిని చైనా అడ్డుకుంటోందని ఆవేదన
- అలాంటిదేమీ లేదన్న చైనా
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ దేవుడిగా మారిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ముందుకొచ్చాడు. అయితే, తాను వందలాది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటోందని సోనూ సూద్ ఆరోపించాడు. తమ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కన్సైన్మెంట్ను చైనా అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీని వల్ల భారత్‌లో ప్రతి నిమిషం ప్రాణాలు పోతున్నాయని విచారం వ్యక్తం చేశాడు. కాబట్టి తమకు సాయం చేయాలని, తమ కన్సైన్మెంట్స్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసి త్వరితగతిన భారత్ చేరేలా చూడాలని చైనా విదేశాంగమంత్రిత్వ శాఖ, భారత్‌లోని ఆ దేశ రాయబారిని కోట్ చేస్తూ ట్వీట్ చేశాడు.
సోనూ సూద్ ట్వీట్‌పై ఢిల్లీలోని చైనా రాయబారి సన్ వీడాంగ్ స్పందించారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘ట్విట్టర్లో మీరు చేసిన వ్యాఖ్యలను చూశాం. కొవిడ్‌పై పోరాడుతున్న భారత్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చైనా నుంచి భారత్‌కు సరుకు రవాణా విమానాలు సాధారణంగానే నడుస్తున్నాయి. గత రెండు వారాల్లో 61 సరుకు రవాణా విమానాలు చైనా నుంచి భారత్ చేరుకున్నాయి. మీరు అనుకుంటున్నట్టు ఇంకేదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నాం’’ అని సోనూసూద్‌కు సన్ వీడాంగ్ ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు.