Sonu Sood: ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్ కు 11 గంటలు, యూపీలో తొమ్మిదిన్నర గంటల సమయం పట్టింది: సోనూ సూద్ ఆవేదన
- కరోనా పేషెంట్ల పాలిట ఆపద్బాంధవుడిగా మారిన సోనూ సూద్
- పేషెంట్లకు బెడ్, ఆక్సిజన్ ఏర్పాటు చేసేందుకు కృషి
- అన్నీ సక్రమంగా జరిగేందుకు కృషి చేస్తానని వ్యాఖ్య
గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి సినీ నటుడు సోనూ సూద్ పూర్తిగా ప్రజా సేవలోనే నిమగ్నమయ్యారు. వేలాది మందికి ఆయన ఆపద్బాంధవుడిగా నిలిచి, రియల్ హీరో అనిపించుకున్నారు. ఇటీవల కరోనా బారిన పడినప్పటికీ ఆయన తన అపన్న హస్తాన్ని చాచడాన్ని ఆపలేదు. దేశ వ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్న పేషెంట్ల కోసం ఆయన రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు.
గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్క వలస కార్మికుడు తన స్వగ్రామానికి క్షేమంగా, సురక్షితంగా చేరుకునేందుకు తన వంతు ప్రయత్నాన్ని సోను చేశారు. అదేమాదిరి ఇప్పుడు కూడా ప్రతి ఒక్క పేషెంట్ కు బెడ్, ఆక్సిజన్ దొరికేలా కృషి చేస్తున్నారు.
అయితే దేశ వ్యాప్తంగా ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లలో బెడ్లు, ఆక్సిజన్ కు తీవ్ర కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన అనుభవాలను సోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఢిల్లీలో ఒక బెడ్ ను ఏర్పాటు చేసేందుకు తనకు 11 గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో తొమ్మిదిన్నర గంటల సమయం పట్టిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కూడా అన్నీ సక్రమంగా జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.