Israel: ఇజ్రాయెల్‌లో విషాదం.. మౌంట్‌మెరెన్ వద్ద తొక్కిసలాటలో 44 మంది మృతి
- లాగ్ బౌమర్ పండుగ సందర్భంగా తరలివచ్చిన వేలాదిమంది భక్తులు
- ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన 38 మంది
- రంగంలోకి ఆర్మీ
- భారీ విపత్తు అన్న ప్రధాని బెంజమన్ నెతన్యాహు
ఇజ్రాయెల్‌లోని మౌంట్ మెరెన్ వద్ద గత అర్ధరాత్రి జరిగిన తొక్కసలాటలో 44 మందికిపైగా మృతిచెందారు. మరో 60మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. యూదుల పండుగ అయిన లాగ్ బౌమర్ సందర్భంగా వేలాదిమంది భక్తులు మౌంట్ మెరెన్ వద్ద ప్రార్థనల కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలంలోనే 38 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. అయితే, తొక్కిసలాటకు గల కారణాలు తెలియరాలేదు. అయితే, ఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన కచేరీ స్టాండ్ కూలడమే ఈ దుర్ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
మౌంట్ మెరైన్‌లోని రెండో శతాబ్దం నాటి మత గురువు రబ్బీ షిమోన్ బార్ యో హై సమాధి వద్ద నివాళులు అర్పించే సమయంలో ఘటన చోటుచేసుకుంది. వేలాదిమంది భక్తులు ఒకే మూలకు తోసుకురావడంతో ముందున్నవారు కిందపడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది భారీ విపత్తు అని పేర్కొన్నారు. గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆర్మీ క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్లను ఉపయోగించింది.