West Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పరిసమాప్తి... ముగిసిన చివరి విడత
- 8 విడతల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
- మార్చి 27న తొలి విడత
- నేడు చివరిదైన 8వ విడత పోలింగ్
- సాయంత్రం 5.30 గంటలకు 76.07 శాతం ఓటింగ్
- మే 2న ఓట్ల లెక్కింపు
పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 8 విడతల్లో పోలింగ్ చేపట్టిన సంగతి తెలిసిందే. నేడు చివరిదైన ఎనిమిదో విడత పోలింగ్ జరిగింది. సాయంత్రం 6.30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5.30 గంటల సమయానికి రాష్ట్రంలో 76.07 శాతం ఓటింగ్ నమోదైంది. నాలుగు జిల్లాల్లో జరిగిన ఈ పోలింగ్ లో అత్యధికంగా బిర్భూమ్ జిల్లాలో 81.82 శాతం నమోదైంది.
నియోజకవర్గాల వారీగా చూస్తే ముర్షీదాబాద్ జిల్లాలోని హరిహరపురా నియోజకవర్గంలో 84.19 శాతం పోలింగ్ జరిగింది. ఇక కోల్ కతాలోని జొరాసంకో నియోజకవర్గంలో అత్యల్పంగా 48.45 శాతం ఓటింగ్ నమోదైంది.
చివరి విడతలో భాగంగా 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 283 మంది అభ్యర్థులు చివరి దశ ఎన్నికల్లో పోటీపడ్డారు. మే 2న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27న ప్రారంభమైన సంగతి తెలిసిందే.