Woman Pilot: లైంగిక వేధింపుల నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన భారత వాయుసేన మహిళా పైలెట్
- ఫ్లయిట్ కమాండర్ వేధించాడన్న మహిళా పైలెట్
- ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్న పైలెట్
- జమ్మూకశ్మీర్ హైకోర్టులో పిటిషన్
- వాయుసేనకు, రక్షణ మంత్రిత్వ శాఖకు కోర్టు నోటీసులు
భారత వాయుసేనలో లైంగిక వేధింపుల కలకలం చెలరేగింది. తనను ఫ్లయిట్ కమాండర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళా పైలెట్ జమ్మూకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించింది. పైగా వాయుసేనలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించింది. ఆ మహిళా పైలెట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... భారత వాయుసేన (ఐఏఎఫ్)తో పాటు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు కూడా నోటీసులు జారీ చేసింది. మహిళా పైలెట్ ఆరోపణలపై నాలుగు వారాల్లో జవాబు ఇవ్వాలని జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం ఆదేశించింది.
కాగా, మహిళా పైలెట్ పై సదరు ఫ్లయిట్ కమాండర్ పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తగిన ఆధారాలను ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకర రీతిలో తాకడం వంటి పనులు చేశారని కోర్టుకు విన్నవించారు. తాను ఎదుర్కొంటున్న సమస్య పట్ల భారత వాయుసేనలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి నివేదిస్తే, అక్కడ ఆమెకు న్యాయం జరగలేదని తెలిపారు.