Sputnik V: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌పై బ్రెజిల్ ఆరోపణలు.. మండిపడ్డ రష్యా
- స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇవ్వని బ్రెజిల్
- రక్షణ పరమైన విషయాలను కారణాలుగా చెప్పిన నిపుణులు
- టీకాలో అడినో వైరస్ వాడారని వివరణ
- దాని వల్ల దుష్ప్రభావాలు లేవన్న రష్యా
అత్యధిక కరోనా కేసులు నమోదైన తొలి మూడు దేశాల్లో బ్రెజిల్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో ఇప్పటికే ప్రతి రోజు 70,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ వినియోగానికి బ్రెజిల్ అనుమతి నిరాకరించింది.
ఇందుకు రక్షణ పరమైన విషయాలను కారణాలుగా చెప్పింది. బ్రెజిల్లో కరోనా కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో స్పుత్నిక్-వీ కోసం ఆ దేశంలోని పలు రాష్ట్రాలు ఆర్డర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతుల విషయమై సమావేశమైన ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం మాత్రం అందుకు నిరాకరించింది.
స్పుత్నిక్-వీ తయారీలో నిబంధనలు ఉల్లంఘించారని, టీకాలో అడినో వైరస్ వాడారని, అంతేగాకుండా తప్పుడు సమాచారాన్ని అందించారని బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. తమ వ్యాక్సిన్‌పై బ్రెజిల్ ఆరోపణలు చేయడంతో రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ వ్యాక్సిన్‌లో వాడిన అడినో వైరస్ కారణంగా టీకా తీసుకున్నవారు దుష్ప్రభావాల బారిన పడినట్లు ఆధారాలు లేవని చెప్పింది.