West Bengal: ఓవైపు కొవిడ్ విజృంభణ.. మరోవైపు ఎండ.. వెనకడుగు వేయని బెంగాల్ ఓటర్లు!
- నేడు 34 అసెంబ్లీ స్థానాల్లో ఏడో విడత పోలింగ్
- కరోనా బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు
- ఓటు హక్కు వినియోగించుకున్న దీదీ
- ఇప్పటి వరకు 259 స్థానాల్లో పోలింగ్ పూర్తి
- మరో 35 స్థానాలకు 29న పోలింగ్
ఓవైపు కొవిడ్ విజృంభణ.. మరోవైపు ఎండ తీవ్రత.. ఇవేవీ బెంగాల్ ఓటర్లను ఆపలేకపోయాయి. ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు జరిగిన ఏడో విడత పోలింగ్‌లో 75.06 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం
మొత్తం ఐదు జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ముర్షీదాబాద్ జిల్లాలో అత్యధికంగా సాయంత్రం ఐదు గంటల వరకే 80.07 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 268 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
కొవిడ్ విజృంభణ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా బాధితులు ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరి గంట పోలింగ్ ప్రత్యేకంగా వారి కోసమే కేటాయించారు.
తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని భవానీపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకుగానూ మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు పూర్తయిన ఏడు విడతల్లో మొత్తం 259 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఇక ఏప్రిల్ 29న జరిగే చివరి విడతలో 35 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.