Kerala: కేరళలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు!

lockdown like curbs in Kerala

  • సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు బంద్‌
  • రాజకీయ, సామాజిక సమావేశాలపై నిషేధం
  • దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 7:30 గంటల కల్లా మూసివేయాలి
  • మే 2న జరగనున్న ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఆదేశాలు
  • అధికారులు రెండు డోసుల టీకా తీసుకోవాలి
  • లేదా 72 గంటల ముందు పొందిన కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేరళ ప్రభుత్వం ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్సులు, ఈత కొలనులు, బార్లు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు మూసివేయాలని ఆదేశించింది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలపై నిషేధం విధించింది.

ఇక శని, ఆదివారాల్లో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. శనివారం ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించింది. వివాహాలు రెండు గంటల్లో పూర్తికావాలని.. 50 మంది కంటే ఎక్కువ హాజరు కావొద్దని ఆదేశించింది. అంత్యక్రియలు, కర్మకాండలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపింది. దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 7:30 గంటల కల్లా మూసివేయాలని ఆదేశించింది. అయితే, హోం డెలివరీ సేవలకు మాత్రం రాత్రి 9 గంటల వరకు అనుమతించింది.

దుకాణాలు, రెస్టారెంట్లలో వినియోగదారులతో ఎక్కువ సేపు మాట్లాడొద్దని స్పష్టం చేసింది. మందిరాలు, ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఏ సమయంలోనూ 50 మంది కంటే ఎక్కువ ఉండొద్దని స్పష్టం చేసింది. ఇక మే 2న జరగనున్న ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అధికారులు రెండు డోసుల టీకా తీసుకోనైనా ఉండాలి లేదా 72 గంటల ముందు పొందిన కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ అయినా కలిగి ఉండాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News