Telangana Media Academy: తెలంగాణ జర్నలిస్టులకు రాష్ట్ర మీడియా అకాడెమీ ఆర్థికసాయం
- కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం
- తక్షణ సాయంగా రూ. 2 లక్షలను అందిస్తామని చెప్పిన అల్లం నారాయణ
- మే 10లోగా కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకోవాలని సూచన
కర్తవ్య నిర్వహణలో భాగంగా పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మీడియా అకాడెమీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయాన్ని ప్రకటించింది. తక్షణ సాయంగా రూ. 2 లక్షలను అందిస్తామని మీడియా అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబసభ్యులు మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు, కరోనా పాజిటివ్ రిపోర్టు, అక్రిడేషన్ కార్డును ఆయా జిల్లాల డీపీఆర్వోలు ధ్రువీకరించాల్సి ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అందరికీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. కరోనా బారిన పడిన పాత్రికేయులను కూడా ఆదుకుంటామని... వారు కూడా ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.