HDFC: మీ ప్రాంతానికే హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం... 15 రకాల సేవలు!
- పలు నగరాల్లో లాక్ డౌన్ నిబంధనలు
- 19 నగరాల్లో మొబైల్ ఏటీఎం సేవలు
- కరోనా నిబంధనలను పాటించేలా ఏర్పాట్లు చేశామన్న హెచ్‌డీఎఫ్‌సీ
ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ, పలు నగరాల్లో లాక్ డౌన్ తరహా నిబంధనలు అమలవుతున్న వేళ, బ్యాంకింగ్ అవసరాలను తీర్చేందుకు ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ, 15 రకాల సేవలను అందించే ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. వీటిని దేశవ్యాప్తంగా 19 నగరాల్లో అందుబాటులోకి తెచ్చామని, ఒక్కో ఏటీఎం నగరంలోని మూడు నుంచి నాలుగు ప్రాంతాలను కవర్ చేసేలా ఏర్పాటు చేశామని పేర్కొంది.
హైదరాబాద్ సహా,అన్ని ముఖ్య నగరాల్లోని వినియోగదారులు, డబ్బు విత్ డ్రా సహా పలు రకాల సేవలను తమ ప్రాంతాలను దాటి వెళ్లకుండానే పొందవచ్చని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మొబైల్ ఏటీఎంల వద్ద శానిటైజేషన్ తో పాటు, కస్టమర్లు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశామని తెలిపింది. గత సంవత్సరం పూర్తి లాక్ డౌన్ ఉన్న సమయంలో తమ మొబైల్ ఏటీఎంలు 50 నగరాలు, పట్టణాల్లో లక్షలాది మందికి సేవలందించాయని పేర్కొంది.