Narendra Modi: ఇది ప్రొటోకాల్ కు విరుద్ధం.. సీఎంలతో సమావేశంలో కేజ్రీవాల్ తీరుపై ప్రధాని మోదీ స్పందన

PM Modi terms Delhi CM Aravind Kejriwal comments as Inappropriate

  • దేశంలో కరోనా విశ్వరూపం
  • సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ భేటీ
  • హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
  • ఆక్సిజన్ కొరతపై అసంతృప్తి
  • మరోసారి ఇలా జరగదన్న కేజ్రీవాల్

దేశంలో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించడం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా పరిస్థితులపై ప్రధాని సమక్షంలో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రస్థాయిలో ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర విషాదం తప్పదని అన్నారు. తాము ఈ పరిస్థితులను ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, సీఎంలతో సమావేశంలో బహిరంగంగా అసహనం ప్రదర్శించి, సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారంటూ ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వైఖరి ఆక్షేపణీయం అని, ప్రోటోకాల్ కు విరుద్ధమని పేర్కొన్నారు. సమావేశ సంప్రదాయం ఇది కాదని అన్నారు. కేజ్రీవాల్ తనతో చర్చిస్తుండగా, దాన్ని ఆయన కార్యాలయ సిబ్బంది లైవ్ టెలికాస్ట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. అందుకు చింతిస్తున్నానని, భవిష్యత్ లో ఇలా జరగకుండా చూస్తానని పేర్కొన్నారు.

ఈ అంశంపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ, ఈ సమావేశం టీవీల్లో ప్రసారం చేసేందుకు ఉద్దేశించింది కాదని, కానీ కేజ్రీవాల్ అందుకు భిన్నంగా వ్యవహరించారని పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News