UK: బ్రిటన్​ లో ఖరీదైన విడాకులు.. తల్లికి రూ.779 కోట్లు చెల్లించనున్న కుమారుడు!

In UKs Largest Divorce Case Son Ordered To Pay 100 Million Dollar To Mom

  • తల్లిని తండ్రి వదిలేసిన వైనం
  • ఆస్తుల వివరాలను కొడుకు దాచిపెట్టాడన్న కోర్టు
  • నిజాయతీ లేని వ్యక్తి అంటూ జడ్జి వ్యాఖ్య 
  • వెంటనే భరణం చెల్లించాలంటూ తనయుడికి ఆదేశం

బ్రిటన్ లోనే అత్యంత ఖరీదైన విడాకులివి. మామూలుగా అయితే విడాకులు పొందిన మహిళకు భర్త భరణంగా చెల్లిస్తుంటాడు. కానీ, ఈ కేసులో మాత్రం తల్లికి తనయుడే భరణం చెల్లించాల్సి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.779 కోట్లు (10.4 కోట్ల డాలర్లు) తనయుడు ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఏమైంది? అజర్ బైజాన్ కు చెందిన ఫర్ఖద్ అఖ్మదోవ్, తాతియానా అఖ్మదోవాలు దంపతులు. వారికి తేమూర్ అఖ్మదోవ్ అనే కుమారుడున్నాడు. బ్రిటన్ లో ఆర్థికంగా బాగా ఎదిగిన కుటుంబం. రష్యాలో గ్యాస్ వ్యాపారం ఉంది.

అయితే, మనస్ఫర్థలతో దంపతులు విడిపోయారు. తనకు భరణం కింద 62.7 కోట్ల డాలర్లు (సుమారు రూ.4,702 కోట్లు) ఇవ్వాలంటూ కోర్టులో తాతియానా అఖ్మదోవా కోర్టుకెళ్లారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉండగానే.. భరణం రాకుండా ఉండేందుకు తన భర్త ఫర్ఖద్, కుమారుడు తెమూర్ లు అడ్డుకుంటున్నారని, ఆస్తుల వివరాలేవీ చెప్పకుండా దాచేస్తున్నారని తాతియానా ఆరోపించారు. లండన్ హైడ్ పార్క్ లోని ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ తాళాలను దాచిపెట్టారని దావాలో పేర్కొన్నారు.

గతంలో 115 మీటర్ల పొడవైన సూపర్ యాట్ , 14 కోట్ల డాలర్ల విలువైన ట్రెజర్ హౌస్ అనే కళాఖండాన్ని సొంతం చేసుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడిపై దావా వేశారు. అన్ని ఆస్తులను దాచేస్తున్నారని, తన కుమారుడితో సంబంధాలు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే, తాను చాలా నష్టాల్లో ఉన్నానని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివేటప్పుడే ట్రేడింగ్ లో డబ్బులు పెట్టి నష్టపోయానని, ఆ విషయం తన తల్లికీ తెలుసని తెమూర్ వివరణ ఇచ్చాడు.

అయితే, అతడి వ్యాఖ్యలతో విభేదించిన కోర్టు.. ప్రస్తుతం నష్టాల గురించి మాట్లాడడం లేదని వ్యాఖ్యానించింది. తన తండ్రి ఖాతాకు సంబంధించిన వివరాలన్నీ తల్లికి దూరంగానే ఉంచారని పేర్కొంది. సంతోషంగా ఉండే కుటుంబాలు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాయని, కానీ, దు:ఖంలో బతికే కుటుంబాలు ఎప్పుడూ దు:ఖంలోనే ఉంటాయని పేర్కొంది. కాబట్టి ఇప్పుడు అఖ్మదోవ్ కుటుంబం అత్యంత దు:ఖభరితమైన కటుంబమని వ్యాఖ్యానించింది. తాతియానాకు రూ.779 కోట్ల భరణం చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News