Chandrababu: ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్టుపై చంద్ర‌బాబు, దేవినేని, లోకేశ్ మండిపాటు

chandrababu slams jagan

  • సంగం డైరీని నిర్వీర్యం చేయాల‌నుకుంటున్నారు 
  • గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నారు: చ‌ంద్ర‌బాబు
  • అక్రమంగా అరెస్టు చేయడం  దుర్మార్గపు చర్య‌: దేవినేని
  •  ధూళిపాళ్ల నరేంద్రపై కక్ష కట్టారు: లోకేశ్

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. 'తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముందస్తు నోటీసులు లేకుండా, ఉన్నపళంగా వందల మంది పోలీసులు ఇంటికి వెళ్లి అరాచకం సృష్టిస్తారా? సంగం డైరీని ఎవరికోసం నాశనం చేయాలని చూస్తున్నారు? నరేంద్రను వెంటనే విడుదల చేయాలి' అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే వైసీపీ ప్రభుత్వం ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆయ‌న‌ విమర్శలు గుప్పించారు. అమూల్‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని చెప్పారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి లేదు కానీ, ఇటువంటి అక్రమ అరెస్ట్‌లు మాత్రం ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టికే త‌మ పార్టీ నేత‌లు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావుపై  కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  కరోనా క‌ట్ట‌డిలో విఫలమవడంతోనే ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్పడుతున్నార‌ని అన్నారు.

ధూళిపాళ్ల అరెస్టుపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కూడా మండిప‌డ్డారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేసిన‌ ధూళిపాళ్ల‌ నరేంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తి వేళ బాధితులు బెడ్లు ఇప్పించమని వేడుకుంటుంటే, వారిని పట్టించుకోని ప్రభుత్వం త‌మ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంద‌ని విమర్శించారు. వందల మంది పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య‌ అని మండిప‌డ్డారు.

'ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో రాక్షసానందం పొందుతున్నారు వైఎస్ జ‌గ‌న్‌. ధూళిపాళ్ల కుటుంబం నలుగురికి సాయం చేసే చరిత్ర ఉన్న కుటుంబం. మీలాంటి దోపిడీ కుటుంబం కాదు' అని నారా లోకేశ్ అన్నారు.
 
'సంగం డైరీ ద్వారా వేలాది మంది పాడి రైతులకు అండగా నిలిచింది ధూళిపాళ్ల కుటుంబం. ప్రభుత్వ అసమర్థ‌తను, దొంగ కేసులను ఆధారాలతో సహా ఎండగట్టినందుకే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కక్ష కట్టారు' అని ఆయన ఆరోపించారు.
 
'ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రభుత్వం ఆడిన ఒక డ్రామాని స్ట్రింగ్ ఆపరేషన్ తో బట్టబయలు చేసి జగన్ రెడ్డి కుట్రలను బయటపెట్టినందుకే ఈ కక్ష సాధింపు చర్యలు. 5 సార్లు వరుసగా శాసనసభ్యుడిగా గెలవడం ఒక రికార్డ్ అయితే, చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ధూళిపాళ్ల నరేంద్రకి ప్రత్యేక స్థానం ఉంది. అక్రమ కేసులు బనాయించి నరేంద్రను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం ముందు జగన్ రెడ్డి అన్యాయం ఏనాటికి విజయం సాధించలేదు' అన్నారు లోకేశ్.

  • Loading...

More Telugu News