Corona Virus: ఏపీలో కరోనా కల్లోలం... ఒక్కరోజులో 22 మంది మృతి
- రాష్ట్రంలో వేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా
- గత 24 గంటల్లో 35,922 కరోనా పరీక్షలు
- 6,582 మందికి కొవిడ్ పాజిటివ్
- చిత్తూరు జిల్లాలో 1,171 కేసులు, ఐదుగురి మృతి
- యాక్టివ్ కేసుల సంఖ్య 44,686
ఏపీలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. ఒక్క పశ్చిమ గోదావరి మినహాయించి అన్ని జిల్లాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో మరోసారి వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 35,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,582 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 912, గుంటూరు జిల్లాలో 804, కర్నూలు జిల్లాలో 729 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 2,343 మంది కోలుకోగా, 22 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,62,037 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,09,941 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 44,686 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,410కి పెరిగింది.