COVID19: జూన్ నాటికి భారత్ లో రోజువారీ కరోనా మరణాలు 2,320!.. లాన్సెట్ నివేదిక
- లాన్సెట్ జర్నల్ లో భారత నిపుణుల హెచ్చరిక
- సెకండ్ వేవ్ నిర్వహణ పేరిట నివేదిక
- కేసులు ఎక్కువున్నా కొన్ని జిల్లాల్లోనే ఉన్నాయని వెల్లడి
- మరణాల రేటు మరింత పైకి ఎగబాకే ప్రమాదం
- టెస్టులకే 780 కోట్ల డాలర్ల ఖర్చు
ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ చాలా వేగంగా ఉంది. రోజూ కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. 2 లక్షలు దాటుతున్నాయి. వెయ్యి మందికిపైగా మరణిస్తున్నారు. అయితే, ఈ పరిస్థితి ముందుముందు మరింత తీవ్రంగా మారుతుందని కొవిడ్ 19 కమిషన్ ఇండియా టాస్క్ ఫోర్స్ సభ్యులు హెచ్చరిస్తున్నారు.
మరి కొన్ని రోజుల్లో రోజువారీ సగటు మరణాలు 1,750కి పెరుగుతాయని, జూన్ మొదటి వారం నాటికి ఆ సంఖ్య 2,320కి చేరుతుందని హెచ్చరించారు. ‘భారత్ లో కొవిడ్ సెకండ్ వేవ్ నిర్వహణ: తీసుకోవాల్సిన చర్యలు’ పేరిట సభ్యులు రూపొందించిన నివేదికను లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. ఆ నివేదికలోని అంశాలివీ..
కేసులు కొన్ని జిల్లాల్లోనే
ప్రస్తుతానికి కేసులు లక్షల్లో నమోదవుతున్నా అవన్నీ కొన్ని జిల్లాల్లోనే వస్తున్నాయని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాలు తగ్గాయి. ఫస్ట్ వేవ్ లో రోజువారీ నమోదయిన కేసుల్లో సగం 40 జిల్లాల్లో వస్తే.. ఇప్పుడు కేవలం 20 జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. గత ఏడాది ఆగస్టు – సెప్టెంబర్ మధ్య 75 శాతం కేసులు 100 జిల్లాల్లో నమోదైతే.. ఇప్పుడు 20 నుంచి 40 జిల్లాల్లోనే వస్తున్నాయి.
వేగం చాలా ఎక్కువ
ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో కేసుల పెరుగుదల వేగం చాలా ఎక్కువగా ఉంది. ఒక్క రోజు కేసులకు సంబంధించి 10 వేల నుంచి 80 వేలకు పెరగడానికి కేవలం 40 రోజులే తీసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ లో అందుకు 83 రోజులు పట్టింది. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో లక్షణాల్లేని కేసులు, లక్షణాలు తక్కువున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.
మరణాలు రేటు పైపైకి
దేశంలో కరోనా మొదలైన మార్చి నుంచి ఇప్పటిదాకా మరణాల రేటు 1.3 శాతంగా నమోదైంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటిదాకా కొవిడ్ బారిన పడిన వారిలో చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువ. ఈ సమయంలో కరోనా మరణాల రేటు 0.87%గా ఉంది. చూడ్డానికి సెకండ్ వేవ్ లో మరణాల రేటు తక్కువగానే ఉందనిపించినా.. ఏప్రిల్ 10 నాటికి రోజూ సగటున 664 మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు.
దీంతో మున్ముందు కరోనా మరణాల రేటు మరింత పెరిగే ప్రమాదముంది. అంతేగాకుండా సాధారణ ఆరోగ్య సేవలకూ అంతరాయం కలిగే అవకాశముంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కరోనా టెస్టింగ్ లకు 780 కోట్ల డాలర్లు, కరోనా చికిత్సలకు 170 కోట్ల డాలర్ల వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం రావొచ్చు.
కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలివీ..
- అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ల ఆధారంగా యువతకూ టీకాలు ఇవ్వాలి. 45 ఏళ్ల లోపుండి ఇతర జబ్బులున్న వారినీ ప్రాధాన్య వర్గాల్లో చేర్చాలి.
- మరిన్ని వ్యాక్సిన్లకు త్వరితగతిన అనుమతులను ఇవ్వాలి.
- దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి. ప్రస్తుతం దేశంలో నెలకు సగటున 7 నుంచి 8 కోట్ల డోసుల వ్యాక్సిన్లే తయారవుతున్నాయి. రోజూ 50 లక్షల డోసుల టార్గెట్ అనుకున్నా.. ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు పెట్టుకున్న టార్గెట్ లో సగం మందికే సరిపోతాయి.
- జనాలకు వ్యాక్సిన్లపై అవగాహన కల్పించాలి.
- పూర్తిగా లాక్ డౌన్లు విధించాల్సిన అవసరం లేదు. దాని వల్ల పేదలపైనే ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది.
- కరోనా వైరస్ లో జన్యు క్రమ విశ్లేషణలను పెంచాల్సిన అవసరముంది. దాని వల్ల దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడానికి గల కారణాలు, మ్యుటెంట్లను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
- విదేశాల నుంచి వచ్చే వారికి వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ ను అమలు చేయాలి.
- పది మంది కన్నా ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి.