: శ్రీశాంత్ నివాసంలో నకిలీ పోలీసు అరెస్టు
స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన క్రికెటర్ శ్రీశాంత్ నివాసంలో ఓ వ్యక్తి తాను పోలీసు అధికారినంటూ ప్రవేశించి... ఆనక కటకటాల వెనక్కి చేరాడు. కోచిలోని శ్రీశాంత్ ఇంటికి గురువారం వచ్చిన ఆ వ్యక్తి సెక్యూరిటీ గార్డుతో తనను తాను పోలీసు అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఫిక్సింగ్ కేసులో శ్రీ తల్లిదండ్రులను విచారించేందుకు ముంబయి నుంచి వచ్చినట్టు తెలిపాడు. దీంతో, ఆ గార్డు అతన్ని ఇంట్లోకి అనుమతించాడు. లోపలికెళ్ళిన ఆ వ్యక్తి తాను బీసీసీఐ నుంచి వచ్చినట్టు శ్రీశాంత్ తల్లితో చెప్పాడు. శ్రీశాంత్ ఫిక్సింగ్ కుంభకోణంలో నుంచి బయటపడేందుకు సహకరిస్తానని వారితో నమ్మబలికాడు.
అయితే, అతని వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండడంతో శ్రీ తల్లిదండ్రులు కోచి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు ఆ అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా, అతడు పుణేకు చెందిన నీలేశ్ రామచంద్ర జగతాప్ (32) అలియాస్ సచిన్ అని తేలింది. కాగా, తాను యూత్ కాంగ్రెస్ నాయకుడినని, తనకు శరద్ పవార్ తెలుసని బెదిరించే ప్రయత్నం చేసినా, పట్టించుకోని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.