Chris Moris: క్రిస్ మోరిస్ మెరుపు ఇన్నింగ్స్ తో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్!
- స్వల్ప లక్ష్యమైనా కాపాడుకోవాలని ప్రయత్నించిన డీసీ
- చివర్లో మోరిస్ మెరుపులతో రాజస్థాన్ విజయం
- ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలి గెలుపు
ప్రత్యర్థి ముందుంచిన లక్ష్యం చిన్నది. కానీ ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో సర్వశక్తులూ ఒడ్డుతున్న ఢిల్లీ క్యాపిటల్స్.. మరోవైపు తమ బౌలర్ల శ్రమను వృథా కానివ్వరాదని, మ్యాచ్ గెలిచి, తొలి విజయాన్ని నమోదు చేయాలన్న ఆలోచన రాజస్థాన్ రాయల్స్ ది. వెరసి, ముంబై వేదికగా, గురువారం రాత్రి జరిగిన మరో థ్రిల్లింగ్ మ్యాచ్ లో చివరకు విజయలక్ష్మి రాజస్థాన్ రాయల్స్ ను వరించింది.
గత రెండు మ్యాచ్ లలో ఛేజింగ్ చేసిన జట్టు ఓడిపోగా, ఈ మ్యాచ్ లో మాత్రం ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. చివరి రెండు ఓవర్ల వరకూ ఢిల్లీ వైపు నిలిచిన విజయలక్ష్మి, ఆపై క్రిస్ మోరిస్ విధ్వంసకర బ్యాటింగ్ (18 బంతుల్లో నాలుగు సిక్స్ లతో 36)తో మనసు మార్చుకుంది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ, 32 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. మిగతావారు పెద్దగా రాణించలేదు. ఆర్ఆర్ బౌలర్లలో ఉనద్కత్ 3, ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీశారు. టీ-20 మ్యాచ్ లలో పెద్దగా కష్టసాధ్యం కాని లక్ష్యమైన 148 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.
రాయల్స్ జట్టులో బట్లర్ 2, మన్ వోహ్రా 9, సంజూ శాంసన్ 4, శివమ్ దూబే 2 పరుగులు చేసి అవుట్ కాగా, టాప్ ఆర్డర్ ను కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి దిశగా వెళుతుందనే భావించారంతా. అయితే, ఆపై డేవిడ్ మిల్లర్ రాకతో పరిస్థితి మారింది, మిల్లర్ 62 పరుగులకు తోడు, తెవాటియా 19, ఉనద్కత్11, రబడ 19, మోరిస్ 36 పరుగులు చేయడంతో ఆ జట్టు విజయం సాధించి, ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది.