china: చైనా సాంకేతిక స్వర్ణయుగం ముగిసినట్లేనా?

end of chinas tech golden age started

  • ఆర్థిక సంస్కరణ తర్వాత మారిన చైనా రూపురేఖలు
  • సాంకేతికత, డిజిటల్‌ రంగాల్లోనూ తనదైన ముద్ర
  • ఈ క్రమంలో చైనా ప్రభుత్వంలో ‘ఫలాలన్నీ విజేతలకే’ అన్న భావన
  • ఆంక్షల పరంపరకు శ్రీకారం చుట్టిన డ్రాగన్‌
  • జాక్‌ మాతోనే మొదలైందంటున్న విశ్లేషకులు
  • ఇక చైనా దిగ్గజ సంస్థల విస్తరణ వ్యూహం కంచికే

కమ్యూనిస్టు దేశమైన చైనా 1970ల నాటి సంస్కరణల తర్వాత ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. అగ్రరాజ్యం అమెరికాకే సవాల్‌ విసిరే స్థాయికి చేరింది. ఈ క్రమంలో దశాబ్ద కాలంగా సాంకేతికత, డిజిటల్‌ రంగాల్లో సైతం తనదైన ముద్ర వేసింది. చైనాతో పాటు అంతర్జాతీయంగానూ తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ ప్రయాణంలో చైనా తన కఠిన రక్షణాత్మక విధానాలను పక్కన పెట్టేసింది. పెట్టుబడిదారి వ్యవస్థను పరోక్షంగా ప్రోత్సహించడంతో అనేక కంపెనీలు ప్రపంచవేదికపై తన సత్తాను చాటాయి. అలీబాబా, యాంట్‌ గ్రూప్‌, టెన్సెంట్‌, హువావే వంటి దిగ్గజ సంస్థలు ఆ కోవకు చెందినవే.

అయితే, తాజాగా చైనా అవలంబిస్తున్న విధానాలు సాంకేతిక రంగంలో ఆయా సంస్థల స్వర్ణయుగానికి ముగింపు పలకనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది జాక్‌ మా, ఆయనకు చెందిన సంస్థలపై కఠిన ఆంక్షలతోనే ప్రారంభమైందని తెలుస్తోంది. అలీబాబా గ్రూప్‌పై ఇటీవల వివిధ కారణాల కింద చైనా ప్రభుత్వం 2.8 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది.

అలాగే యాంట్‌ గ్రూప్‌ కార్యకలాపాలపైనా ఆంక్షల కొరడా ఝళిపించింది. ఇక తాజాగా మంగళవారం దాదాపు 34 అతిపెద్ద కంపెనీలకు హెచ్చరికలు జారీచేసింది. వీటిలో టెన్సెంట్‌ నుంచి టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ వరకు పలు దిగ్గజ సంస్థలు ఉన్నాయి. చట్టాల్లోని పరిమితులను దాటొద్దని తీవ్రంగా హెచ్చరించడం గమనార్హం.

ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థలకే సవాల్‌ విసిరే స్థాయికి ఎదిగిన చైనా కంపెనీల శకం ఇక ముగిసిందన్న సందేశాన్ని పరోక్షంగా డ్రాగన్‌ ప్రభుత్వం సదరు సంస్థలకు పంపుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆంక్షలకు ప్రత్యక్షంగా గురికాని సంస్థలపైనా ఒత్తిడి పెగనుందని షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న చైనా స్కిన్నీ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్‌ ట్యాన్నర్‌ అంచనా వేశారు. ఇకపై ఆయా సంస్థలు వసూలు చేసే రుసుములు, ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం వంటి కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో యాంట్‌ గ్రూప్‌, యూఎబావో వంటి ఆర్థిక సంస్థలు సైతం క్రమంగా తమ కార్యకలాపాల్ని కుందించుకోవాల్సి రావొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.

గత దశాబ్ద కాలంలో టెలికమ్యూనికేషన్‌ నుంచి రిటైల్‌ వరకు చైనా నుంచి అనేక అంతర్జాతీయ స్థాయి సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. జాక్‌ మా, పోనీ మా వంటి దిగ్గజాల నుంచి యువతకు మార్గనిర్దేశం లభించింది. అయితే, ఈ క్రమంలో అవి సాధించిన అపార విజయాలతో.. ‘ఫలాలన్నీ విజేతలకే’ అన్న కమ్యూనిస్టు వ్యతిరేక విధానం క్రమంగా రాజ్యమేలుతోందని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్రమంగా ఆంక్షల కొరడాను ఝళిపించడం ప్రారంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News