Pakistan: ప్రతిష్ఠాత్మక రామన్ మెగసేసె అవార్డు గ్రహీత, పాక్ మానవహక్కుల ఉద్యమకారుడు రెహమాన్ కరోనాతో కన్నుమూత
- 1930లో హర్యానాలో జన్మించిన రెహమాన్
- 65 ఏళ్లపాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన వైనం
- భారత్-పాకిస్థాన్ మధ్య శాంతికి పరితపించిన రెహమాన్
ప్రతిష్ఠాత్మక రామన్ మెగసేసె అవార్డు గ్రహీత, పాకిస్థాన్‌కు చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు ఐఏ రెహమాన్ కరోనాతోపాటు వయసు సంబంధిత సమస్యలతో నిన్న ఉదయం లాహోర్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ షెర్రీ రెహమాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి కోసం పరితపించిన ఆయన 1930లో హర్యానాలో జన్మించారు. 65 ఏళ్లపాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. పలు పత్రికలకు సంపాదకుడిగానూ వ్యవహరించారు.
1989లో ‘పాకిస్థాన్ టైమ్స్’కు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రచయితగా మూడు పుస్తకాలు రాశారు. పాకిస్థాన్-ఇండియా ఫోరం ఫర్ పీస్ అండ్ డెమొక్రసీ సంస్థను స్థాపించారు. పాకిస్థాన్‌లో మానవహక్కుల కమిషన్‌కు 20 ఏళ్లపాటు డైరెక్టర్‌గా, సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. ఆ దేశంలో హిందువులు, క్రిస్టియన్లు సహా మైనార్టీలకు గొంతుకయ్యారు.
దైవ దూషణ చట్టాల్లో సవరణల కోసం పోరాడారు. ఆయన సేవలకు గాను రామన్ మెగసేసె శాంతి పురస్కారంతోపాటు ఇంటర్నేషనల్ అండర్‌స్టాండింగ్, నురెంబర్గ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డులు లభించాయి.