Home Guard: హోంగార్డు వినోద్ ఇంట్లో తుపాకీ పేలిన ఘటనలో అసలేం జరిగిందో చెప్పిన బెజవాడ సీపీ
- హోంగార్డు నివాసంలో తుపాకీ కాల్పులు.. భార్య మృతి
- భార్యాభర్తలు గొడవపడ్డారని వెల్లడించిన సీపీ
- తుపాకీతో హోంగార్డే కాల్చాడని వివరణ
- ఆ తుపాకీ ఏఎస్పీ శశిభూషణ్ దని వెల్లడి
- దీనిపై విచారణ జరుగుతోందని స్పష్టీకరణ
విజయవాడలో హోంగార్డు వినోద్ నివాసంలో తుపాకీ పేలిన ఘటనలో అతని భార్య రత్నప్రభ మరణించిన సంగతి తెలిసిందే. తాను పిస్టల్ ను బీరువాలో పెట్టమని భార్య చేతికిచ్చానని, తుపాకీ మిస్ ఫైర్ అవడంతో భార్య చనిపోయిందన్నది హోంగార్డు వినోద్ కథనం. అయితే దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అసలు విషయం గుర్తించారు. దీనిపై విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు వివరాలు తెలిపారు. భార్యపై హోంగార్డే కాల్పులు జరిపాడని వెల్లడించారు.
రాత్రి హోంగార్డు వినోద్ దంపతుల మధ్య గొడవ జరిగిందని చెప్పారు. భార్యకు చెందిన బంగారాన్ని వినోద్ తాకట్టు పెట్టడంతో ఈ వివాదం ఏర్పడిందని తెలిపారు. దాంతో ఆగ్రహం చెందిన వినోద్ 9 ఎంఎం పిస్టల్ తో ఒక రౌండు కాల్పులు జరిపాడని సీపీ వెల్లడించారు. దగ్గర్నుంచి కాల్చడంతో బుల్లెట్ ఛాతీలోకి దూసుకెళ్లి ఆమె మృతి చెందిందని వివరించారు.
అయితే హోంగార్డు వినోద్ కాల్పులు జరిపిన తుపాకీ ఏఎస్పీ శశిభూషణ్ దని, ఆయన తుపాకీ హోంగార్డు వద్దకు ఎలా వచ్చిందన్న దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని సీపీ పేర్కొన్నారు. హోంగార్డుకు పిస్టల్ ఇచ్చాడని తేలితే ఏఎస్పీపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.