: ప్రమాదంలో చెన్నై ఫ్రాంచైజీ భవితవ్యం!
ఫిక్సింగ్ వ్యవహారంలో ఆరోపణలెదుర్కొంటున్న బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ గడువులోగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరుకాలేదని తెలుస్తోంది. దీంతో, ఆయన్ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు చెలరేగాయి. గురునాథ్ ఈ సాయంత్రం ఐదింటికి పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. ఇదిలావుంటే, బీసీసీఐ నిబంధనల ప్రకారం యాజమాన్యంపై పోలీసు కేసులు నమోదైన నేపథ్యంలో సదరు ఐపీఎల్ ఫ్రాంచైజీని రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.
చెన్నై జట్టు ఎల్లుండి కోల్ కతాలో ఐపీఎల్-6 ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాగా, చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం గురునాథ్ విషయమై స్పష్టమైన ప్రకటన చేసింది. గురునాథ్ యజమానీ కాదు, సీఈఓ అంతకన్నా కాదని పేర్కొంది. జట్టు యాజమాన్యంలో అతనో గౌరవ సభ్యుడు మాత్రమే అని తేల్చి చెప్పింది. ఇలాంటి అవినీతి వ్యవహారాలను తమ సంస్థ ఎన్నడూ సహించదని ఇండియా సిమెంట్స్ వర్గాలు వ్యాఖ్యానించాయి. దర్యాప్తుకు సహకరిస్తామని కూడా ఆ వర్గాలు తెలిపాయి.