ED: తెలంగాణ మాజీ మంత్రి నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు
- భారీగా నగదు, నగలు స్వాధీనం
- ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు
- నాయిని మాజీ పీఎస్ బంధువు ఇంట్లోనూ సోదాలు
- షెల్ కంపెనీల నిర్వాహకుడు ప్రమోద్ రెడ్డి నివాసంలోనూ సోదాలు
తెలంగాణలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి నివాసంలో భారీగా నగదు, నగలు గుర్తించారు. రూ.1 కోటికి పైగా విలువైన నగలు, చెక్కులు, విలువైన ఆస్తుల పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటు, నాయిని మాజీ పీఎస్ బంధువు వినయ్ రెడ్డి నివాసంలోనూ ఈడీ సోదాలు చేపట్టి నగదు, నగలు స్వాధీనం చేసుకుంది.
నకిలీ కంపెనీల నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రమోద్ రెడ్డి ఇంట్లోనూ భారీగా నగదు, నగలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ప్రమోద్ రెడ్డి స్థాపించిన డొల్ల కంపెనీల వెనుక కొందరు నేతల ప్రమేయం ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.