Online Token: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి ఆన్ లైన్ టోకెన్ విధానం రద్దు
- దుర్గ గుడి నూతన ఈవోగా భ్రమరాంబ
- టోకెన్ విధానంపై సమీక్ష
- ఇకపై నేరుగా క్యూలైన్లలో ప్రవేశం
- క్యూలైన్ల వద్దే రూ.300, రూ.100 టోకెన్ల జారీ
- భ్రమరాంబను కలిసిన ఆలయ చైర్మన్ సోమినాయుడు
విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఇప్పటివరకు అనుసరిస్తున్న ఆన్ లైన్ టోకెన్ జారీ విధానాన్ని రద్దు చేశారు. ఇటీవలే దుర్గ గుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ఇకపై నేరుగా క్యూలైన్లలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవచ్చని భ్రమరాంబ తెలిపారు. అందుకోసం ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈవో ఆదేశాల నేపథ్యంలో ఇకపై రూ.300, రూ.100 టికెట్లను క్యూలైన్ల వద్దే జారీ చేయనున్నారు.
అటు, దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు ఈవో భ్రమరాంబను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరిగే ఉగాది, చైత్రమాస బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఆలయ అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. ఇటీవల వరకు దుర్గ గుడి ఈవోగా వ్యవహరించిన సురేశ్ బాబు అవినీతి ఆరోపణలపై బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రభుత్వం భ్రమరాంబను ఇక్కడికి బదిలీ చేసింది.