Janagaom: 'లంకెబిందె' బంగారంలో వాటా కావాలంటూ... భూమి పూర్వపు యజమానుల ధర్నా!

Old Landlords Want Share in Treasure in Pembarthi

  • పెంబర్తిలో పొలంలో దొరికిన లంకెబిందెలు
  • తాజా తవ్వకాల్లో మరిన్ని నిధులు లభ్యం
  • ఆందోళన చేస్తున్న పూర్వపు యజమానులకు న్యాయం చేస్తాం
  • హామీ ఇచ్చిన అధికారులు

జనగామ సమీపంలోని పెంబర్తిలో ఇటీవల లభించిన లంకెబిందెల్లో బయల్పడిన ఆభరణాల్లో తమకు కూడా వాటా ఇవ్వాలంటూ, పూర్వపు యజమానులు ఆందోళన చేస్తున్నారు. ఈ భూమిని విక్రయించిన సంకటి ఎల్లయ్య, నర్సయ్య, పరశురాములు, ఐలమ్మ తదితరులు తమ బంధుమిత్రులతో పొలానికి చేరుకుని నిరసన తెలియజేశారు. ఈ ఆభరణాల్లో తమకూ భాగం ఉందని వాదించారు.

రెండు రోజుల క్రితం ఈ ప్రాంతంలో భూమిని చదును చేస్తుండగా, పూర్వకాలంలో ఎవరో దాచిపెట్టిన లంకెబిందెలు లభ్యం కాగా, ఇందులో దాదాపు 5 కిలోల బంగారం ఆభరణాలు లభ్యమయ్యాయి. ఇదే ప్రాంతంలో ఇంకేమైనా విలువైన వస్తువులు లభిస్తాయా? అన్న కోణంలో పురాతత్వ పరిశోధనా అధికారులు తవ్వకాలు జరుపగా, తాజా తనిఖీల్లో మరి కొంత బంగారంతో పాటు నాగ పడగలు, వెండి గొలుసులు, పగడాలు లభించాయి.

ఈ విషయం తెలుసుకున్న సదరు భూమి పూర్వపు యజమానులు ఆ ప్రాంతంలో ధర్నాకు దిగగా, రెవెన్యూ అధికారులు సర్దిచెబుతూ, వారి డిమాండ్ ను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, నిబంధనలకు అనుగుణంగా వారు నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. కాగా, ఈ ఆభరణాలన్నీ గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన వారివని ఈ ప్రాంతంలో పెద్ద చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News