Kerala: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కరోనా పాజిటివ్
- రెండు రోజుల క్రితం కుమార్తె, అల్లుడికి కరోనా నిర్ధారణ
- ప్రస్తుతం స్వగ్రామంలో ఉన్న సీఎం
- ఎలాంటి లక్షణాలు లేవని ప్రకటన
- ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స
- ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించిన విజయన్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన తన స్వగ్రామం కన్నూర్‌లో ఉన్నారని.. ఎలాంటి లక్షణాలు లేవని ప్రకటనలో పేర్కొంది. ఆయన్ను కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించనున్నట్లు వెల్లడించింది.
ఈ విషయాన్ని పినరయి విజయన్ సైతం ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. ‘‘నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోజికోడ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటాను. ఇటీవల నన్ను కలిసినవారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లండి’’ అని విజయన్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
రెండు రోజుల క్రితం విజయన్ కుమార్తె, అల్లుడికి సైతం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ముఖ్యమంత్రికి సైతం కరోనా సోకినట్లు బయటపడింది. కేరళలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా విజయన్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.