Hidma: దండకారణ్యంలో దాడి వెనుక మావోయిస్టు హిడ్మా... తలపై రూ.40 లక్షల రివార్డు!

Mao Hidma is Key Person on CRPF Attack

  • దండకారణ్యంలో జవాన్లపై భీకర దాడి
  • భారీ దాడులు జరపడంలో నైపుణ్యమున్న హిడ్మా
  • ఇప్పటికే ఎన్నో దాడుల్లో ప్రమేయం
  • చదువు లేకున్నా ఆయుధాల వాడకంలో ప్రమేయం

రెండు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ బీజాపూర్ సమీపంలోని తరెం అడవుల్ల సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన భీకర దాడికి సూత్రధారి హిడ్మా అనే మావోయిస్టని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతని తలపై ఇప్పటికే రూ. 40 లక్షల రివార్డుంది. మావోయిస్టుల్లో భారీ దాడులకు వ్యూహాలను రచించడం ఇతని ప్రత్యేకతని పోలీసు అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నంబర్ 1 బెటాలియన్ కమాండర్ గా, దండకారణ్యంలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. గడచిన 20 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో జరిగిన చాలా దాడుల్లో హిడ్మా ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

వాస్తవానికి ముప్పై సంవత్సరాల క్రితమే హిడ్మా మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ లో చేరాడు. సుకుమా జిల్లా పువర్తికి చెందిన గిరిజనుడైన హిడ్మా, కేవలం ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రమే చేసి, ఆపై యుద్ధ నైపుణ్య మెలకువల్లో ఆరితేరాడు. తన విద్యను కేడర్ కు నూరిపోయడంలోనూ సిద్ధహస్తుడన్న పేరుంది. కూంబింగ్ నిమిత్తం వచ్చే బలగాలపైనా, ఆపై వారు సేదదీరే క్యాంపులపైనా మెరుపు వేగంతో దాడి చేసి, అంతే వేగంతో పారిపోవడం హిడ్మా ప్రత్యేకత. మావోయిస్టులకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం మొత్తం ఇతని కనుసన్నల్లోనే ఉంటుందని తెలుస్తోంది.

ఆయుధాలను వాడటంతో పాటు ఐఈడీ బాంబులను తయారు చేసి వాటిని వినియోగించడంలోనూ ఎంతో పట్టున్న హిడ్మాను కేంద్ర కమిటీలోకి తీసుకోవాలని కూడా మావో పెద్దలు భావించారు. అయితే, ఇంకా తక్కువ వయసులోనే ఉండటం, దూకుడుగా వ్యవహరిస్తూ ఉండటంతో కీలక నేతలు మరికొంత కాలం వేచి చూడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

గతంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే భీమా మడవిని హత్య చేసిన కేసులో ఇప్పటికే హిడ్మాపై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ ను కూడా దాఖలు చేసింది. తాజా దాడిలో పాలు పంచుకున్న 250 మందికి హిడ్మా నేతృత్వం వహించాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

  • Loading...

More Telugu News