West Bengal: బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ముగిసిన రెండో దశ పోలింగ్
- బెంగాల్ లో 80.43 శాతం పోలింగ్
- అసోంలో 74.79 శాతం పోలింగ్
- బెంగాల్ లో 30 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్
- అసోంలో 39 స్థానాలకు ఎన్నికలు
- అందరి దృష్టి ఆకర్షించిన నందిగ్రామ్
పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు నిర్వహించిన రెండో దశ పోలింగ్ ముగిసింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5.30 గంటల వరకు పశ్చిమ బెంగాల్ లో 80.43 శాతం పోలింగ్ నమోదు కాగా, అసోంలో 74.79 శాతం ఓటింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 69 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ చేపట్టారు.
కాగా, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ నియోజకవర్గం కూడా ఈ రెండో విడతలోనే పోలింగ్ జరుపుకుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి కారణంగా జాతీయ మీడియా మొత్తం నందిగ్రామ్ పైనే దృష్టి పెట్టింది. నందిగ్రామ్ లో విజయం తమదంటే తమదేనని అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు బీజేపీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేస్తున్నారు.