Varla Ramaiah: కొత్త నోటిఫికేషన్ లేకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే అప్రజాస్వామికమే: వర్ల
- ఏపీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ
- నీలం సాహ్నీతో భేటీ అయిన వర్ల రామయ్య
- టీడీపీ తరఫున విజ్ఞాపన పత్రం అందజేత
- వైసీపీ అక్రమాలను ఆ పత్రంలో వివరించినట్టు వర్ల వెల్లడి
- పరిషత్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని వినతి
ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్నీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ మధ్యాహ్నం నీలం సాహ్నీని ఆమె కార్యాలయంలో కలిశారు. ఆమెకు టీడీపీ తరఫున ఓ విజ్ఞాపన పత్రం అందించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘం సిద్ధమవుతోందని వెల్లడించారు. గత ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిన తీరును తమ విజ్ఞాపన పత్రంలో ఎస్ఈసీకి వివరించామని తెలిపారు.
2014లో ఎంపీటీసీ ఏకగ్రీవాలు 2 శాతం అయితే, ఇప్పుడవి 24 శాతం అని, 2014లో జడ్పీటీసీ ఏకగ్రీవాలు 9 శాతం అయితే, ఇప్పుడవి 19 శాతం అని పేర్కొన్నారు. ఏకగ్రీవాలపై గత ఎస్ఈసీ నిమ్మగడ్డ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవాలని తాజా ఎస్ఈసీ నీలం సాహ్నీని కోరామని వర్ల రామయ్య చెప్పారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని కోరినట్టు వెల్లడించారు. తాజా నోటిఫికేషన్ లేకుండా ఎన్నికలు కొనసాగిస్తే అది అప్రజాస్వామికమే అవుతుందని అన్నారు.