Nara Lokesh: బీజేపీలో టీడీపీ విలీనం అంటూ వార్తలు.. ఘాటుగా స్పందించిన లోకేశ్
- అధికారంలోకి వచ్చాక కూడా అసత్య వార్తలను జగన్ ప్రచారం చేయిస్తున్నారు
- జగన్ కు సిగ్గులేదు.. వెంకట్రామిరెడ్డికి దేవుడు అది ఇవ్వలేదు
- డీసీ ఉద్యోగులకు దక్కని న్యాయంపై కథనాలు రాయి కర్రి శ్రీరామ్
'బీజేపీలో టీడీపీ విలీనం' అంటూ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ లో వచ్చిన కథనంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్, డీసీ అధినేత వెంకట్రామిరెడ్డి, ఈ కథనాన్ని రాసిన కర్రి శ్రీరామ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చేంత వరకు అసత్య ప్రచారమే ఆయుధంగా తన నీలి మీడియా సంస్థల్ని వాడుకున్న జగన్... అధికారంలోకి వచ్చాక కూడా అదే అబద్ధాల వార్తలు, అవే అవాస్తవ కథనాలతో విషప్రచారం కొనసాగించాలనుకుని బొక్కబోర్లా పడుతున్నారని ఎద్దేవా చేశారు. చివరకు తనలాగే అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న దివాళాకోరు వెంకట్రామిరెడ్డి దివాళా పత్రిక డెక్కన్ క్రానికల్ లో ఏప్రిల్ ఫూల్ వార్తలు రాయించుకునే స్థాయికి జగన్ దిగజారిపోయారని విమర్శించారు. జగన్ రెడ్డికి ఎలాగూ సిగ్గులేదని... వెంకట్రామిరెడ్డికి జన్మతః అలాంటిది దేవుడు ఇవ్వలేదని అన్నారు.
జర్నలిస్టు పేరుతో ఇలాంటి తప్పుడు కథనాలు రాయడానికి కర్రి శ్రీరామ్ ఇంకెందుకు సిగ్గుపడతారని లోకేశ్ వ్యాఖ్యానించారు. టీడీపీ మీద ఇలాంటి ఏప్రిల్ ఫూల్ వార్తలు రాసే బదులు.. నువ్వు నిజంగా జర్నలిస్టువే అయితే, డెక్కన్ క్రానికల్ గ్రూపు ఉద్యోగులకు చాలా రోజులుగా ఇవ్వని జీతాలపై కథనాలు వెయ్యాలని సవాల్ విసిరారు. నీకు దమ్ముంటే ఆంధ్రభూమిని మూసేసి, ఉద్యోగులను బయటకు తోసేసి, నెలలు గడుస్తున్నా దక్కని న్యాయంపై వార్తలు రాయి కర్రి శ్రీరామ్ అని అన్నారు.