Virender Sehwag: పంత్ ను చూస్తుంటే నా ప్రారంభ రోజులు గుర్తుకొస్తున్నాయి: సెహ్వాగ్
- ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఇరగదీసిన పంత్
- పవర్ ప్లేను అద్భుతంగా వాడుకున్నాడన్న సెహ్వాగ్
- పంత్ కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని వ్యాఖ్య
ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన వన్డే సిరీస్ లో యువకెరటం రిషభ్ పంత్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో రెండు వన్డేలు ఆడిన పంత్... 151.96 స్ట్రయిక్ రేట్ తో 155 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో, పంత్ పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా దిగ్గజ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ కూడా పంత్ ను ఆకాశానికెత్తేశారు.
పంత్ ఆటతీరును చూస్తుంటే తన కెరీర్ లో ప్రారంభ రోజులు గుర్తుకొస్తున్నాయని సెహ్వాగ్ చెప్పారు. ఇంగ్లండ్ సిరీస్ లో భారత్ కు సానుకూలాంశం పంతేనని అన్నారు. పవర్ ప్లేను అద్భుతంగా వాడుకున్నాడని కితాబునిచ్చారు. పంత్ ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటాడని... ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన అతనికి లేదని చెప్పారు. తన ఆటను తాను ఆడుకుంటూ పోతాడని ప్రశంసించారు. పంత్ కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని చెప్పారు.