Mumbai: ముంబై ఎయిర్ పోర్టులో బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ అరెస్ట్!
- రాజస్థాన్ నుంచి ముంబైకి రాగానే అరెస్ట్
- తనను ఎవరూ అరెస్ట్ చేయలేదన్న అజాజ్
- తానే స్వయంగా ఎన్సీబీ కార్యాలయానికి వచ్చానని వెల్లడి
బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్-7 హౌస్ మేట్, వివాదాస్పద నటుడు అజీజ్ ఖాన్ ను ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, విమానాశ్రయంలో అరెస్ట్ చేయడం కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో భాగంగా అజాజ్ ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్సీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నిన్న రాజస్థాన్ నుంచి ముంబైకి అజాజ్ రాగా, ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేశారు.
కాగా, మాదక ద్రవ్యాలను పలువురికి సరఫరా చేసిన షాదాబ్ బటాటాను విచారించిన వేళ, ఖాన్ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆపై ఈ కేసుకు సంబంధించి లోఖండ్ వాలా, అంధేరీ తదితర ప్రాంతాల్లో సోదాలు కూడా చేసింది. ప్రస్తుతం అజాజ్ ను నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తుండగా, ఇదే కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడిన అజీజ్, తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని, తానే స్వయంగా అధికారులను కలిసేందుకు వచ్చానని పేర్కొనడం గమనార్హం.
కాగా, డ్రగ్స్ కేసులో అజాజ్ ఖాన్ పై ఆరోపణలు రావడం, విచారణను ఎదుర్కోవడం ఇదే తొలిసారేమీ కాదు. మూడేళ్ల క్రితం 2018లోనూ ముంబై పోలీసులు ఈయన్ను అరెస్ట్ చేశారు. ఆపై అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేసిన కేసులో 2019లో రెండోసారి, ఫేస్ బుక్ లో అసభ్య పోస్టులు పెట్టినందుకు ఏప్రిల్ 2020లో మరోసారి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ 7, 8వ సీజన్ లలో కనిపించిన అజాజ్ పలు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.