EverGreen: అప్పట్లోనే సూయజ్ కు ప్రత్యామ్నాయ కాలువ నిర్మాణం ఆలోచన చేసిన అమెరికా!
- 1963లో అమెరికా నివేదిక
- ఇజ్రాయెల్ నెగెవా ఎడారిలో నిర్మాణానికి యోచన
- 1,500 అడుగుల లోతు, వెయ్యి అడుగుల వెడల్పు
- 160 మైళ్ల పొడవున కాలువకు ప్రతిపాదన
- మైలుకు 4 చొప్పున అణు పేలుడు పదార్థాలు
- 130 మైళ్ల వరకు పెట్టాలని ప్లాన్
- వాటిని పేల్చి కాలువ తవ్వాలని ప్రణాళిక
సూయజ్ కాలువలో దాదాపు వారం పాటు అడ్డంగా ఇరుక్కుపోయిన 'ఎవర్ గివెన్' నౌక పక్కకైతే తొలగిపోయింది. వాణిజ్యానికి లైన్ క్లియర్ చేసింది. ఈ వారం రోజులూ ప్రపంచ వాణిజ్యానికి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. రెండు సముద్రాలను.. ఇంకా చెప్పాలంటే రెండు ప్రపంచాలను కలిపే ఓ చిన్న కాలువ.. పెద్ద సమస్యను సృష్టించింది. దానికి ప్రత్యామ్నాయాలపైనా చర్చ నడిచింది.
అయితే, ఈ చర్చే నాలుగు దశాబ్దాల క్రితమూ జరిగింది. అప్పట్లో మిత్రదేశాలైన ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు దెబ్బతిని యుద్ధం జరగడం, కొన్నేళ్ల పాటు సూయజ్ కాలువ మార్గం మూతపడడంతో అమెరికా ప్రత్యామ్నాయ కాలువపై దృష్టి పెట్టింది. ఇజ్రాయెల్ లోని నెగెవా ఎడారిలో మధ్యదరా, ఎర్రసముద్రం, హిందూ సముద్రాలను కలుపుతూ పెద్ద కాలువ నిర్మించాలని 1963లో లివ్ మోర్ ఓ నివేదికను తయారు చేసింది. అందుకు అణు పేలుడు పదార్థాలను వాడాలని ప్రతిపాదించింది.
ఒకటి కాదు.. రెండు కాదు.. 520 అణు పేలుడు పదార్థాలను పేల్చి 1,500 అడుగుల లోతుతో 160 మైళ్ల పొడవున (దాదాపు 257 కిలోమీటర్లు) కాలువను నిర్మించాలనుకుంది. అందుకు మొత్తం కాలువ పొడవులో మైలు (కిలోమీటరున్నర)కు నాలుగు అణు పేలుడు పదార్థాలను చొప్పున 130 మైళ్ల (209 కిలోమీటర్లు) పొడవున మొత్తం 520 అణు పేలుడు పదార్థాలను పెట్టాలని ప్రతిపాదించింది. కాలువ వెడల్పు వెయ్యి అడుగులు వచ్చేలా 1,300 అడుగుల లోతులో ఒక్కొక్కటి 2 టన్నుల బరువైన పేలుడు పదార్థాలను పాతిపెట్టి పేలుళ్లు జరపాలని పేర్కొంది. అంటే 520 అణు పేలుడు పదార్థాల శక్తి 1.04 గిగాటన్నులన్నమాట.
దానికి అయ్యే ఖర్చునూ లెక్కగట్టింది. ఆ కాలంలో అంత పొడవైన కాలువకు 57.5 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని పేర్కొంది. అణు పేలుడు పదార్థాలతో 130 మైళ్ల తవ్వకానికి 26 కోట్ల డాలర్లు, 30 మైళ్ల సంప్రదాయ తవ్వకానికి 9 కోట్ల డాలర్లు, భద్రతా ప్రమాణాలు పాటించేందుకు 15 కోట్ల డాలర్లు, తవ్వకాలు జరిపేందుకు ఆర్మీ కంటింజెన్సీలకు 15 శాతం అలవెన్సుల కింద 7.5 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని లివ్ మోర్ నివేదిక తేల్చింది.