Corona Virus: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా బీభత్సం... ఒక్కరోజులో 30 వేలకు పైగా కొత్త కేసులు
- మహారాష్ట్రలో కరోనా స్వైరవిహారం
- ఇప్పటికీ అదుపులోకి రాని మహమ్మారి
- దేశంలోకెల్లా అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే!
- గత 24 గంటల్లో 31,643 మందికి పాజిటివ్
- 102 మంది మృతి
దేశంలోకెల్లా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నది మహారాష్ట్రలోనే. కరోనా సంక్షోభం తలెత్తినప్పటి నుంచి మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. ఇతర రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి నిదానించిన సమయంలోనూ ఇక్కడ అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వెల్లడయ్యయి. ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగుతోంది. కరోనా కొత్త వేరియంట్లు కూడా తోడవడంతో మహారాష్ట్రలో కరోనా విలయానికి అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా ఒక్కరోజులోనే 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 31,643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 102 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న 20,854 మందిని డిశ్చార్జి చేశారు. మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27,45,518కి పెరిగింది. ఇప్పటివరకు 23,53,307 మంది కోలుకున్నారు. ఇంకా 3,36,584 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 54,283కి చేరింది.