Yoganathan: టికెట్‌తో పాటు ప్రయాణికులకు మొక్కలు అందిస్తున్న బస్ కండక్టర్‌పై మోదీ ప్రశంసలు

PM Modi Praises TNSTC Bus Conductor Yoganathan
  • 34 ఏళ్లుగా బస్ కండక్టర్‌గా యోగనాథన్
  • ఆదాయంలో అత్యధికభాగం మొక్కల కోసం ఖర్చు
  • సీబీఎస్‌ఈ ఐదో తరగతిలో యోగనాథన్‌పై పాఠం
  • ప్రధాని ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బు
ప్రయాణికులకు టికెట్‌తోపాటు మొక్కలు అందిస్తున్న కోయంబత్తూరు ఆర్టీసీ బస్ కండక్టర్ యోగనాథన్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నిన్నటి మన్‌కీబాత్‌లో ప్రధాని మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం యోగనాథన్ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రయాణికులకు యోగనాథన్ టికెట్‌తోపాటు ఓ మొక్కను కూడా ఇస్తున్నారని తెలిపారు. ఇందుకోసం ఆయన తన ఆదాయంలో అత్యధిక భాగాన్ని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.

మోదీ తన పేరును ప్రస్తావించడంపై యోగనాథన్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సందర్బంగా యోగనాథన్ మాట్లాడుతూ.. తాను గత 34 ఏళ్లుగా కండక్టర్‌గా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా మొక్కలు నాటినట్టు తెలిపారు. ఇక ఆయన తనకు వచ్చే ఆదాయంలో 40 శాతం మొక్కలకే ఖర్చు పెడుతుండడం గమనార్హం. గతేడాది ఏకంగా 85 వేల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న యోగనాథన్‌పై సీబీఎస్ఈ ఐదో తరగతిలో ఓ పాఠాన్ని కూడా చేర్చారు.
Yoganathan
Tamil Nadu
Bus Conductor
TNSTC

More Telugu News