Assom: ‘సీఎం పదవి’పై అసోం సీఎం శర్వానంద సోనోవాల్​ ఆసక్తికర వ్యాఖ్యలు

Question Is Not If I Want To Remain In Power Assam Chief Minister

  • తాను పదవిలో ఉంటానా? లేదా? అన్నది ముఖ్యం కాదన్న సోనోవాల్
  • బీజేపీ మంచి పనులు చేసిందా? లేదా? అన్నదే ముఖ్యమని కామెంట్
  • అధికారంలోకి వస్తే తప్పుల్లేని ఎన్నార్సీని అమలు చేస్తామని హామీ

అసోంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని తమ పార్టీ చూరగొన్నదని అన్నారు. శనివారం అసోంలో మొదటి దశ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా.. ఆదివారం ఆయన ఓ ఆంగ్ల మీడియా చానెల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో సుస్థిర శాంతిని నెలకొల్పి, రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినందుకే ప్రజలు తమను ఆదరిస్తున్నారని సోనోవాల్ చెప్పారు. ఐదేళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయన్నారు. సుపరిపాలన అందించడం, రాష్ట్రాన్ని అవినీతి, తీవ్రవాదం, అక్రమ వలసదారుల సమస్యల నుంచి బయటపడేయడం వంటి సమస్యల్లో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు.

ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎంతో శ్రద్ధ వహించారన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే భద్రత ఉంటుందని, అభివృద్ధి, శాంతి ఉంటాయని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని మీడియా ప్రతినిధి అడగ్గా.. ‘‘ముఖ్యమంత్రి ఎవరన్నది కాదు ప్రశ్న. సోనోవాల్ కే మళ్లీ అధికారం వస్తుందా? లేదా? అని కాదు. బీజేపీ మంచి పనులు చేసిందా? లేదా? అన్నదే ముఖ్యం. మేమందరం బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకే పనిచేస్తున్నాం’’ అని అన్నారు.

అధికారంలోకి వస్తే తప్పుల్లేని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్సార్సీ)ని అమలు చేస్తామని సోనోవాల్ చెప్పారు. రాష్ట్రంలో అక్రమ వలసదారులు లేకుండా చేస్తామని తేల్చి చెప్పారు. ఎన్నార్సీలో చాలా మంది అక్రమ వలసదారుల పేర్లను నమోదు చేశారని, ఆ పేర్లన్నింటినీ తొలగించేస్తామని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News