Errabelli: నూతనంగా నియమితులైన పంచాయతీ కార్యదర్శుల వేతనాల పెంపు... సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎర్రబెల్లి
- అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ నిర్ణయం
- సమాన పనికి సమాన వేతనం
- ప్రస్తుత కార్యదర్శులతో సమానంగా కొత్త కార్యదర్శులకు వేతనం
- రెట్టింపు వేతనం అందుకుంటారన్న ఎర్రబెల్లి
- మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపు
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. నూతనంగా నియమితులైన పంచాయతీ కార్యదర్శులకు కూడా ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులతో సమానంగా వేతనం పెంచారు. దీనిపై సీఎం కేసీఆర్ కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కొన్నాళ్లుగా కొత్త గ్రామ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న డిమాండ్ సీఎం హామీతో తీరిందని వెల్లడించారు.
కొత్తగా నియమితులైన 9,355 మంది పంచాయతీ కార్యదర్శులకు లబ్ది చేకూరుతుందని ఎర్రబెల్లి తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన ఇప్పుడందుకున్న వేతనాలకంటే ఇకపై రెట్టింపు అందుకోనున్నారని వివరించారు. ఈ సందర్భంగా, పంచాయతీ కార్యదర్శులు ఇనుమడించిన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.