BMW: భారత్ లో అత్యంత ఖరీదైన బైక్ ను లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ
- 999 సీసీ ఇంజిన్ తో బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్
- ఎం సిరీస్ లో మొట్టమొదటి బైక్
- ధర రూ.42 లక్షలు (ఎక్స్ షోరూం)
- బుకింగ్ లు ప్రారంభం
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ద్విచక్రవాహనాల విభాగం బీఎండబ్ల్యూ మోటారాడ్ ఇండియా తన పోర్ట్ ఫోలియాలో మరో మోడల్ ను చేర్చింది. సరికొత్త బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్ మోడల్ ను భారత్ లో ప్రవేశపెట్టింది. ఎం సిరీస్ లో భారత రోడ్లపై పరుగులు తీయనున్న మొట్టమొదటి సూపర్ బైక్ ఇది. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.42 లక్షలు. దేశవ్యాప్తంగా బీఎండబ్ల్యూ మోటారాడ్ డీలర్ల వద్ద బుకింగ్ లు ప్రారంభమయ్యాయి.
గతంలో వచ్చిన బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్ మోడల్ ను అభివృద్ధి చేసి ఎం సిరీస్ లో విడుదల చేశారు. దీంట్లో 999 సీసీ వాటర్/ఆయిల్ కూల్డ్ 4 సిలిండర్ ఇన్ లైన్ ఇంజిన్ పొందుపరిచారు. గరిష్ఠంగా 212 హెచ్ పీ కలిగివుంటే ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 306 కిలోమీటర్లు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.1 సెకన్లలోనే అందుకుంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంట్లో సౌకర్యవంతమైన రైడింగ్ కోసం రోడ్, డైనమిక్, రేస్ మోడ్స్ ఏర్పాటు చేశారు.
అత్యాధునిక షిఫ్ట్ కామ్ టెక్నాలజీ సహితమైన బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్ ప్రధానంగా రేసింగ్ బైక్ అని దీని డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది. బ్రేక్స్, కార్బన్ వీల్స్ ప్రత్యేకంగా రూపొందించారు. దీంట్లో మల్టిఫంక్షనల్ ఇన్ స్ట్రుమెంటల్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. బైక్ కు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ ప్యానెల్ పై దర్శనమిస్తుంది. కిలోమీటర్లతో సంబంధం లేకుండా మూడేళ్ల వారంటీ, ఐదేళ్ల వారంటీ పొడిగింపు సదుపాయాలు బైక్ కొనుగోలుదారులకు అందించనున్నారు.