Jagan: విద్యారంగంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్
- తాడేపల్లిలో అధికారులతో సీఎం జగన్ సమావేశం
- అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంపై సమీక్ష
- సొంతంగా పరీక్ష పత్రాలు తయారుచేసుకునే విధానం రద్దు
- జేఎన్ టీయూ పరీక్ష పత్రాలనే వినియోగించాలని స్పష్టీకరణ
రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానం, విద్యాదీవెనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అటానమస్ కాలేజీల పరీక్షల విధానంలో మార్పులకు ఆమోదం తెలిపారు.
అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నాపత్రాలు రూపొందించుకునే విధానాన్ని రద్దు చేశారు. ఇకపై జేఎన్ టీయూ తయారుచేసిన ప్రశ్నాపత్రాలే వినియోగించాలని స్పష్టం చేశారు. అటానమస్, నాన్ అటానమస్ కాలేజీలన్నింటికీ ఇవే ప్రశ్నాపత్రాలు అమలు చేయనున్నారు. అటానమస్ కాలేజీల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా జేఎన్ టీయూకే ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. పరీక్షల్లో అక్రమాల నిరోధానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని సర్కారు భావిస్తోంది.
ఈ సందర్భంగా సీఎం జగన్ స్పందిస్తూ... డిగ్రీ సాధించాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని పేర్కొన్నారు. నైపుణ్యం లేకపోతే ముఖాముఖి పరీక్షను కూడా ఎదుర్కొనలేమని అభిప్రాయపడ్డారు. ప్రతి కోర్సులోనూ అప్రెంటిస్ విధానం తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు. కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు విలువ ఉండదని పేర్కొన్నారు.