V Srinivas Goud: ఆరున్నరేళ్లలో 73 శాతం వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- సీఎం కేసీఆర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ పొగడ్తల జల్లు
- చిత్తశుద్ధితో ఉద్యోగుల వేతనాలు పెంచారని కితాబు
- పీఆర్సీ 7 శాతం వేతనాలు పెంచాలని చెప్పిందన్న గౌడ్
- కేసీఆర్ ఏకంగా 30 శాతం వేతనాలు పెంచారని వెల్లడి
- దేశంలోనే అధికమొత్తంలో వేతనాలు చెల్లిస్తోంది తామేనని ఉద్ఘాటన
తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉద్యోగులకు వేతనాలు పెంచిందని అన్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా గానీ వేతనాల అంశంలో రాజీపడలేదని తెలిపారు.
పీఆర్సీ సిఫారసుల ప్రకారం 7 శాతం వేతనాలు పెంచాలని చెప్పినప్పటికీ... సీఎం కేసీఆర్ మాత్రం ఏకంగా 30 శాతం పెంచారని, ఉద్యోగులపై తనకున్న అభిమానాన్ని ఆ విధంగా చాటుకున్నారని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. దేశంలో అధిక మొత్తంలో వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ఆరున్నరేళ్ల వ్యవధిలో 73 శాతం వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు.