: విధాన సభల తీరుతెన్నులపై రాష్ట్రపతి ఆవేదన
ప్రజలకోసం చట్టాలు చేయాల్సిన విధాన సభలు పార్లమెంటరీ ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సాగుతున్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. చీటికిమాటికి వాయిదాలు పడుతూ, చిరాకు పుట్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన శాసనసభ్యులనుద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'వాదించండి, చర్చించండి, విభేదించండి'.. అంతేగానీ, సభాకార్యక్రమాలకు అడ్డుతగిలి అంతరాయాలు కలిగించొద్దని హితవు పలికారు. ఎన్నికైన శాసనసభ్యులు తమకు ఓటేసినందుకు ప్రజలకు రుణపడి ఉండాలని, అలాకాకుండా, బాధ్యతలను విస్మరించడం అనైతికమని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం, ఇటీవల ముగిసిన బడ్జెట్ సెషన్ల తీరే. బొగ్గు కుంభకోణం, చైనా చొరబాటు, 2జీ స్కాంలో జేపీసీ ముసాయిదా వ్యవహారం అన్నీ కూడా ఎలాంటి చర్చకూ నోచుకోలేదు. ఇక ఆహార భద్రత బిల్లు, భూసేకరణ బిల్లు ఆమోదానికి ఎదురుచూస్తూ టేబుళ్ళకే పరిమితమయ్యాయి. లోక్ సభ పలుమార్లు వాయిదాపడుతూ, రెండ్రోజుల ముందే సమావేశాలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు ప్రస్తుత సభల తీరుతెన్నులకు అద్దం పట్టేవే.