Teenmar Mallanna: తెలంగాణ ప్రజలు నన్ను భుజాలకెత్తుకున్నారు: తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna Responds On His Defeat In MLC Elections

  • ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యే రోజు ఎంతో దూరంలో లేదు
  • సామాన్యుడిని సీఎం కుర్చీలో కూర్చోబెడతా
  • రూ. 100 కోట్లు ఖర్చు చేసి పల్లా గెలిచారు

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి  తీన్మార్ మల్లన్న ముచ్చెమటలు పట్టించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమి పాలయ్యారు. కౌంటింగ్ కేంద్రం వద్ద గత రాత్రి విలేకరులతో  ఆయన మాట్లాడుతూ గెలిచిన రాజేశ్వర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేశ్వర్‌రెడ్డి తన గెలుపు కోసం రూ. 100 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. మూడు శాతం ఓట్లతో గెలిచిన పల్లాకు శుభాకాంక్షలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.

సామాన్యుడినైన తనను తెలంగాణ ప్రజలు భుజానికి ఎత్తుకున్నారని అన్నారు. తన గెలుపు కోసం నిండు గర్భిణి తన ఆపరేషన్‌ను సైతం వాయిదా వేసుకుందన్నారు. ఈ ఎన్నికల్లో వందకు వందశాతం ప్రజలే గెలిచారని, ఇలా చూసుకుంటే మల్లన్న విజయం సాధించినట్టేనని అన్నారు. ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యే రోజు ఎంతో దూరంలో లేదని, సామాన్యుడిని సీఎం కుర్చీలో కూర్చోబెడతామని పేర్కొన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని మల్లన్న తెలిపారు.

  • Loading...

More Telugu News