Kodali Nani: లోకేశ్ కు సర్టిఫికెట్ ఎలా ఇచ్చారో స్టాన్ ఫర్డ్ వర్సిటీకి లేఖ రాస్తా: కొడాలి నాని
- చంద్రబాబు, లోకేశ్ పై కొడాలి నాని ధ్వజం
- చంద్రబాబుకు ప్రజాక్షేత్రంలో శిక్ష వేస్తామని వెల్లడి
- ట్విట్టర్ లో వాగుతున్నాడంటూ లోకేశ్ పై ఆగ్రహం
- వైఎస్సార్ దెబ్బ ఎలాంటిదో చంద్రబాబును అడగాలని వ్యాఖ్యలు
తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించడంలో సిద్ధహస్తుడైన ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పైనా తనదైన శైలిలో ధ్వజమెత్తారు. తన ట్రేడ్ మార్కు తిట్లతో విరుచుకుపడ్డారు. కోర్టులో స్టేలు తెచ్చుకోవడానికి చంద్రబాబు ఏమైనా చేయగలడని, చంద్రబాబుకు న్యాయస్థానంలో శిక్షలు పడకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలతో శిక్షలు వేయిస్తామని చెప్పారు.
ఇక, చంద్రబాబు పుత్రరత్నం ట్విట్టర్ లో అదేపనిగా వాగుతున్నాడని, వైఎస్సార్ దెబ్బ ఎలాంటిదో లోకేశ్ తన తండ్రి చంద్రబాబును అడగాలని అన్నారు. తలకాయలో విషయం లేని వ్యక్తి అని, వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వ్యక్తిని అని లోకేశ్ పై కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. నాడు రామలింగరాజు డబ్బుతో లోకేశ్ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడని ఆరోపించారు. లోకేశ్ స్టాన్ ఫర్డ్ వర్సిటీలో చదివినప్పుడు ఎవరి ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయ్యాయో ఆ ఖాతా వివరాలు బయటపెట్టగలరా? అని కొడాలి నాని సవాల్ విసిరారు. అసలు స్టాన్ ఫర్డ్ లో చదివానని చెప్పుకునే బుర్రలేని లోకేశ్ కు సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ విషయమై స్టాన్ ఫోర్డ్ వర్సిటీ వర్గాలకు లేఖ రాస్తానని అన్నారు.
మంగళగిరి ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వ్యక్తికి సీఎం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని నిలదీశారు. ఆఖరికి స్టీల్ ప్లాంట్ కార్మికుడి ఆత్మహత్య అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడని లోకేశ్ పై మండిపడ్డారు. చంద్రబాబుకు, లోకేశ్ కు దమ్ముంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీని ప్రశ్నించాలని హితవు పలికారు. చంద్రబాబు ఉచ్చులో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చిక్కుకోవద్దని కొడాలి నాని సూచించారు. కార్మికులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.