Iceland: అగ్నిపర్వతం బద్దలైంది.. వినువీధుల్లోకి నిప్పులు చిమ్మింది!
- 100 మీటర్లు పైకి ఎగసిన లావా
- ఐస్లాండ్ రాజధాని రీజావిక్ లో ఘటన
- ఇళ్లలో బిక్కు బిక్కుమంటున్న ప్రజలు
- నెలలో 40 వేల భూకంపాలు
ఎర్రటి రాతి నిప్పులు ఆకాశంలోకి ఫౌంటెయిన్ లా ఎగసిపడ్డాయి. అగ్గి కొండను జారి ఎర్రటి బాట కట్టాయి. సల సల కాగే లావా వరదై పారింది. ఐస్లాండ్ రాజధాని రీజావిక్ లో శుక్రవారం రాత్రి ఓ అగ్ని పర్వతం బద్దలై.. ప్రజలను భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపేలా చేసింది.
రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఫాగ్రాదల్సజాల్ అనే ఓ అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా ఆకాశం ఎర్రటి రంగును అద్దుకున్నట్టు కనిపించింది. కాగా, ప్రస్తుతానికి దాని వల్ల ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఐస్లాండ్ వాతావరణ శాఖ (ఐఎంవో) పేర్కొంది.
ఇది అంత ప్రమాదకరమైనదేమీ కాదని వెల్లడించింది. చదరపు కిలోమీటర్ మేర లావా వ్యాపించిందని, 100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిందని చెప్పింది. ప్రజలెవరూ బయటకు రావొద్దని, ఎగిసిన పొగ వల్ల అనారోగ్యం బారిన పడే ముప్పు ఉందని హెచ్చరించింది. కాగా, ఘటనలో ఎవరికైనా అపాయం కలిగిందా? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో గత నాలుగు వారాల్లోనే (నెలలో) 40 వేల భూకంపాలు వచ్చాయని అధికారులు చెప్పారు. 2014 వరకు ఏటా వెయ్యి నుంచి 3 వేల భూకంపాలే వస్తే.. ఆ తర్వాత మాత్రం క్రమంగా తీవ్రత పెరిగిందని అన్నారు. కాగా, 2010లో ఆ పర్వతం బద్దలైన ఘటనతో పోలిస్తే ఇది చాలా చిన్నదేనని చెబుతున్నారు.
అప్పట్లో అగ్నిపర్వత పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు పొగ చిమ్మిందంటున్నారు. దాని ప్రభావంతో 9 లక్షల విమానాలు రద్దయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో యురేసియా, ఉత్తర అమెరికా టెక్టానిక్ ప్లేట్ల (భూ ఫలకలు) చురుకుదనం ఎక్కువ కావడం, తరచూ అవి ఢీకొట్టుకుంటుండడంతో భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు.