New Farm Laws: రైతుల ఉద్యమంపై భారత ప్రభుత్వంతో చర్చించండి.. అమెరికా విదేశాంగ మంత్రికి ఇద్దరు సెనేటర్ల లేఖ
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమం
- ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా సెనేటర్ల ఆందోళన
- నిరసన తెలపడం హక్కు అని వ్యాఖ్య
- అంతర్గత విషయమని ఇప్పటికే స్పష్టం చేసిన భారత్
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంపై భారత ప్రభుత్వంతో చర్చించాలంటూ అమెరికాలో ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. రైతులు చేస్తున్న ఆందోళన శాంతియుతంగా కొనసాగుతోందని.. వారిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
నిరసన తెలపడం కూడా ఒక హక్కేనన్న విషయాన్ని ప్రస్తావించిన వారు.. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. ఈమేరకు అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, సెనేటర్ బాబ్ మేనెందేజ్, సెనేట్ మెజారిటీ నేత చుక్ షుమర్ గురువారం బ్లింకెన్‌కు లేఖ రాశారు. దీనిపై బ్లింకెన్ ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
ఇప్పటికే పలుసార్లు బ్లింకెన్, మన దేశ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో వివిధ అంశాలపై ఫోన్‌లో మాట్లాడారు. అయితే, వారిరువురి మధ్య ఎప్పుడూ రైతుల అంశం చర్చకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే, ఇది అంతర్గత సమస్య అని, దీనిపై విదేశీ ప్రభుత్వాల జోక్యం అవసరం లేదని పలుసార్లు భారత్ గట్టిగా చెప్పింది. అమెరికా సైతం ఇటువంటి విషయాన్ని భారత్ సొంతంగా పరిష్కరించుకోగలదని భావిస్తున్నామని తెలిపింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత నవంబరు నుంచి ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.