Super Bug: భారత్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.. ఈ 'సూపర్ బగ్'ను తట్టుకోవడం కష్టమంటున్న శాస్త్రవేత్తలు

 superbug can lead to next pandemic

  • అండమాన్ దీవుల్లో కనిపించిన ‘సూపర్ బగ్’
  • దీనిని నిరోధించడం కానీ, అంతం చేయడం కానీ కష్టమంటున్న పరిశోధకులు
  • జ్వరం వచ్చిన తర్వాత మాత్రమే బయటపడే లక్షణాలు
  • మందులు వాడినా అంతిమంగా మరణం

కరోనా మహమ్మారి నుంచి తేరుకుంటున్న భారత్‌కు అంతకంటే భయంకరమైన మరో ముప్పు పొంచి ఉందని ‘ఎం బయో’ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఓ అధ్యయనం హెచ్చరించింది. దేశంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇసుక తిన్నెల్లో ప్రధాన యాంటీ ఫంగల్ ట్రీట్‌మెంట్స్‌ను తట్టుకుని మనగలిగే సూపర్‌బగ్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని కెండిగా ఆరిస్ లేదా, సీ ఆరిస్ అని పిలుస్తారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ బగ్ విస్తృతంగా వ్యాపించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, దీనిని అంతం చేయడం కానీ, దాని వృద్ధిని ఆపడం కానీ దాదాపు అసాధ్యమని చేతులెత్తేస్తున్నారు.

అండమాన్ దీవుల్లోని ఎనిమిది సహజ ప్రదేశాల నుంచి సేకరించిన 48  ఇసుక, నీటి నమూనాలను సేకరించగా ఈ విషయం వెల్లడైనట్టు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అనురాధ నేతృత్వంలోని అధ్యయన బృందం తెలిపింది. మానవ సంచారం ఎక్కువగా ఉండే బీచ్ నుంచి సేకరించిన సీ ఆరిస్ చాలా బలంగా ఉందని, దీనిని అంతం చేయడానికి, లేదంటే వృద్ధిని నిరోధించడానికి మందులు వాడినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, సీఆరిస్ సహజంగానే అండమాన్‌ దీవుల్లో ఉంటుందా? లేక అది అక్కడే మొదలైందా? అన్న విషయాన్ని అధ్యయనం నిరూపించలేదు. బీచ్‌కు వెళ్లిన వారి నుంచి ఇది వచ్చి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు.


సూపర్ బగ్ సోకిన వారిలో ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, జ్వరం, జలుబు వచ్చిన తర్వాత మాత్రమే దీని లక్షణాలు బయటపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మందులు వాడినప్పటికీ లక్షణాలు కొనసాగుతాయని, చివరికి అది మరణానికి దారితీస్తుందని అంటున్నారు. మానవుడి శరీర ఉష్ణోగ్రతకు అలవాటు పడిన ఈ బగ్ గుంపుగా ఒక చోట చేరే వారి నుంచి వ్యాపిస్తోందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News