Botsa Satyanarayana: సీఐడీ నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పాలి: బొత్స
- వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎక్కువ రోజులు తప్పించుకోలేరన్న బొత్స
- చట్టాలను తుంగలో తొక్కి భూములు కాజేశారన్న ఆర్కే
- అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఫిర్యాదు చేశానని వ్యాఖ్య
అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎక్కువ రోజులు తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. సీఐడీ నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, దళితుల భూములను కాజేసిన వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. చంద్రబాబు అండ్ కో చట్టాలను తుంగలో తొక్కి భూములను కాజేశారని చెప్పారు. కేబినెట్ ఆమోదం లేకుండానే భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చారని అన్నారు. అన్ని ఆధారాలను సేకరించిన తర్వాతే సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.