Dasari Srinivasulu: తిరుపతి పార్లమెంటు స్థానం బీజేపీ అభ్యర్థిగా దాసరి శ్రీనివాసులు..?

BJP works hard on Tirupati by polls candidate

  • త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలు
  • రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ల పేర్లు పరిశీలిస్తున్న బీజేపీ
  • అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ముమ్మరం చేసిన కాషాయదళం
  • రేసులో ముందున్న దాసరి శ్రీనివాసులు!

ఏపీలో ఇప్పుడందరి దృష్టి తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలపై పడింది. ఇటీవల తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తిరుపతి బరిలో బలమైన అభ్యర్థిని నిలపాలని బీజేపీ, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ నిలిపే అభ్యర్థికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ఇప్పటికే భాగస్వామ్య పక్షం జనసేన స్పష్టం చేయడంతో... కాషాయదళం అభ్యర్థిని ఎంపిక చేసే కసరత్తులు ముమ్మరం చేసింది.

కాగా, బీజేపీ తిరుపతి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు బాగా ప్రచారంలో ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాసరి శ్రీనివాసులు అనేక శాఖల్లో విధులు నిర్వర్తించారు. పదవీవిరమణ చేసిన అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఇప్పటికే తిరుపతి పార్లమెంటు అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ వర్గాలు ఓ తుది జాబితా సిద్ధం చేయగా, అందులో దాసరి శ్రీనివాసులుకే అత్యధిక అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

బీజేపీ అభ్యర్థి రేసులో మాజీ మంత్రి రావెల కిశోర్, అఖిల భారత సర్వీసుల మాజీ అధికారి సునీల్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల బరిలో దిగే తమ అభ్యర్థి పేరును బీజేపీ మరో రెండ్రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది.

నిన్న జరిగిన బీజేపీ, జనసేన అత్యున్నత సమావేశంలో సోము వీర్రాజు, సునీల్ దేవధర్, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తిరుపతి అభ్యర్థిపై చర్చించడం తెలిసిందే. బీజేపీ అభ్యర్థినే బరిలో దింపేందుకు జనసేన తరఫున పవన్, నాదెండ్ల సమ్మతించారు.

అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం జనసేన తీసుకున్నది చాలా తెలివైన నిర్ణయం అని పేర్కొంటున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని, ఈ సమయంలో తమ అభ్యర్థిని బరిలో దింపితే బీజేపీపై వ్యతిరేకత కాస్తా తమపై తీవ్ర ప్రభావం చూపుతుందని జనసేన నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చిందని చెబుతున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. తిరుపతి ఉప ఎన్నికల బరి నుంచి తెలివిగా తప్పుకున్న జనసేన... బీజేపీని ఊబిలోకి నెట్టిందని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

కాగా, ఏపీలో రథయాత్ర చేసేందుకు బీజేపీ నిర్ణయించింది. రథయాత్రను బీజేపీ గతంలోనే ప్రకటించినా స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని ఏపీ బీజేపీ ప్రణాళిక రూపొందించింది. ఆలయాలపై దాడులు జరిగిన ప్రాంతాల మీదుగా ఈ రథయాత్ర ఉంటుంది.

  • Loading...

More Telugu News