China: సరిహద్దులో చైనా, పాక్ కు చెక్ పెట్టేలా అమెరికా డ్రోన్లకు భారత్ ఆర్డర్!
- వచ్చే నెలలో ఎంక్యూ 9బీ డ్రోన్ల కొనుగోళ్లు
- 300 కోట్ల డాలర్లతో 30 డ్రోన్లు
- 48 గంటల పాటు ఏకధాటిగా నిఘా
- 1,700 కిలోల పేలోడ్ లను మోసుకెళ్లే సామర్థ్యం
సరిహద్దుల్లో ముప్పును దీటుగా ఎదుర్కొనే క్రమంలో చైనా, పాకిస్థాన్ లకు చెక్ పెట్టేలా అమెరికా సాయుధ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. సముద్ర, భూ రక్షణ వ్యవస్థలను పటిష్ఠం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. శాన్ డయీగోకు చెందిన జనరల్ ఆటమిక్స్ తయారు చేసిన ఎంక్యూ 9బీ ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయనుంది.
వచ్చేనెల 30 డ్రోన్ల కొనుగోళ్లకు సంబంధించి 300 కోట్ల డాలర్లతో భారత్ ఒప్పందం చేసుకుంటుందని ఓ అధికారి చెప్పారు. ఇక, గత ఏడాది ఆయుధాల్లేని రెండు ఎంకూ 9 ప్రిడేటర్ డ్రోన్లను భారత్ లీజుకు తీసుకుంది. ఇప్పుడు సాయుధ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది.
కాగా, 1,700 కిలోల పేలోడ్ లను మోసుకెళ్లే ఈ డ్రోన్లు 48 గంటల పాటు ఆగకుండా గస్తీ కాయగలవని నిపుణులు చెబుతున్నారు. హిందూ మహా సముద్రం దక్షిణ ప్రాంతంలో చైనా నౌకలపై నిఘా వేసేందుకు మన నౌకాదళానికి ఇవి బలంగా మారుతాయని అంటున్నారు.
హిమాలయ పర్వత సానువుల్లోని సరిహద్దుల వద్ద పాక్ లక్ష్యాలనూ వీటితో టార్గెట్ చేసుకోవడానికి వీలుంటుందని చెబుతున్నారు. అయితే, దీనిపై ఇటు మన రక్షణ శాఖ గానీ, అటు జనరల్ ఆటమిక్స్ గానీ స్పందించలేదు.