Amarinder Singh: ఐపీఎల్ వేదికల ఎంపికపై పంజాబ్ సీఎం నిరసన గళం
- ఐపీఎల్ 14వ సీజన్ కు షెడ్యూల్ విడుదల
- పరిమిత సంఖ్యలో వేదికల ఎంపిక
- బీసీసీఐ నిర్ణయంపై విమర్శలు
- మొహాలీకి ఏం తక్కువైందన్న పంజాబ్ సీఎం
ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్ కొన్నిరోజుల కిందట విడుదల కాగా, పరిమిత సంఖ్యలోనే వేదికలు ఎంపిక చేయడం విమర్శల పాలవుతోంది. ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మైదానాలను మాత్రమే ఐపీఎల్ పాలక మండలి ఎంపిక చేసింది.
ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అసంతృప్తి గళం వినిపించారు. మొహాలీ మైదానాన్ని ఐపీఎల్ వేదికగా ఎంపిక చేయకపోవడం పట్ల ఆయన బీసీసీఐని ప్రశ్నించారు. మొహాలీ మైదానానికి ఏం తక్కువైందని నిలదీశారు. కరోనా వ్యాప్తి కారణంగా పరిమిత సంఖ్యలో వేదికలు ఎంపిక చేసినప్పుడు ముంబయిని ఎలా ఎంపిక చేస్తారు? మొహాలీని ఎలా విస్మరిస్తారు? అని అన్నారు.
ముంబయిలో రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్న ముంబయిలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణకు అనుమతించినప్పుడు మొహాలీకి అనుమతి ఇవ్వకపోవడానికి కారణం చెప్పాలని బీసీసీఐని కోరారు. కాగా, బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, రైతుల నిరసనలు, ఆందోళనల కారణంగానే మొహాలీని వేదికగా ఎంపిక చేయలేదని చెప్పారు. ఒకవేళ మొహాలీలో హింసాత్మక ఘటనలు జరిగితే ఐపీఎల్ కారణంగా అది అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తుందని వివరించారు.