Ganta Srinivasa Rao: విశాఖ ఉక్కు కోసం మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది: గంటా

Ganta Srinivasarao says if ministers resigned there will be a good impact

  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం జరిగిపోయిందన్న నిర్మల
  • 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని పార్లమెంటులో వెల్లడి
  • భగ్గుమంటున్న ఏపీ వర్గాలు
  • మంత్రులు రాజీనామా చేస్తే టీడీపీ పోటీ పెట్టదన్న గంటా
  • సీఎం కార్యాచరణ ప్రకటించాలని వినతి
  • కార్మికుల తరఫున పవన్ పోరాడాలని సూచన

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం వైఖరిని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టేయడంతో ఏపీ వర్గాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. రాత్రి నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్లపైనే నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఏపీ మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ మంత్రులు రాజీనామా చేసి వస్తే... ఉప ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థులను నిలపబోదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రం అభిప్రాయం ఏంటో స్పష్టంగా తెలిసిందని, దీనిపై సీఎం కార్యాచరణను ప్రకటించాలని గంటా కోరారు.

అటు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తన వైఖరి ఏంటో చెప్పాలని, కార్మికుల పక్షాన పవన్ పోరాడితే బాగుంటుందని అన్నారు. ఢిల్లీలో పాదయాత్రకు టీడీపీ సిద్ధంగా ఉందని, అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీఎంతో కలిసి పనిచేసేందుకు చంద్రబాబు కూడా తన సంసిద్ధతను ఇప్పటికే వ్యక్తం చేశారని గంటా వివరించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేసేందుకు ప్రధానంగా బీజేపీ నేతలు తమ వంతు కృషి చేయాల్సి అవసరం ఉందని నొక్కి చెప్పారు.

కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెలిబుచ్చిన వెంటనే గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News